గుజరాత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరోసారి రెచ్చిపోవడంతో కీలక మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో గిల్ రాణించగా బౌలింగ్ లో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో రాణించి గుజరాత్ విజయంలో తనవంతు పాత్ర పోషించారు. గిల్ 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేసి 17వ ఓవర్లో ఔటయ్యాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది,
గుజరాత్ 54 పరుగుల వద్ద ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (18) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు గిల్-సాయి సుదర్శన్ లు రెండో వికెట్ కు 138 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. గిల్ ఔటయిన తరువాత…31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పాండ్యా 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28; రషీద్ 5 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, ఆకాష్ మధ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 21 పరుగులతో రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8); ఇషాన్ కిషన్ స్థానంలో ఓపెనర్ గా వచ్చిన నేహాల్ వధేరా (4)లు వెనుదిరిగారు. జట్టులో సూర్య కుమార్ యాదవ్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61; తిలక్ వర్మ 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43; కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సరతో 30 పరుగులతో రాణించారు. ఈ ముగ్గురే రెండంకెల స్కోరు దాటడం గమనార్హం. దీనితో 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5; షమీ, రషీద్ ఖాన్ చెరో 2; జోస్ లిటిల్ ఒక వికెట్ సాధించారు.
శుభ్ మన్ గిల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.