మలయాళ దర్శకులు ఒక చిన్న పాయింట్ తీసుకుని .. అందులో ఎమోషన్స్ కలుపుతూ .. సహజత్వానికి చాలా దగ్గరగా కథను తీసుకుని వెళతారు. అందువల్లనే వాళ్ల కథలు ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా కాకుండా జనంలో నుంచి .. వాళ్ల కష్టాల్లో నుంచి పుట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ప్రేమ .. కుటుంబం సంబంధమైన ఎమోషన్స్ ఏవైనా సరే సున్నితమైన భావోద్వేగాలను వాళ్లు ఆవిష్కరించే తీరు ఆడియన్స్ కి నచ్చుతుంది. ఇక హీరో కూడా జనంలో ఒకడుగానే కనిపిస్తాడు .. కాకపోతే కాస్త ముందు నుంచుంటాడు .. అంతే.
ఇదే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమాగా ‘2018’ కనిపిస్తుంది. ఈ నెల 5వ తేదీన మలయాళంలో రిలీజైన ఈ సినిమా అక్కడ హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతోంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా ఇప్పుడు 200 కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతోంది. తక్కువ ఖర్చు పెట్టారంటే … చాలా సింపుల్ గా లాగించేసి ఉంటారనుకుంటే పొరపాటే. తెరపై జరుగుతున్న సన్నివేశాల్లో మీడియా .. జనాలు మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఒక భాగమై ఉంటారు. అంత సహజంగా ఈ సినిమాను లాక్కొచ్చారు.
‘2018’లో కేరళలో వచ్చిన వరదలు .. అక్కడి ప్రజలు పడిన అవస్థలకు సంబంధించిన కథతో ఈ సినిమా నడుస్తుంది. ఒక వైపున వరదలు .. మరో వైపున బాధితుల ఎమోషన్స్ తో ఈ సినిమా చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఓటీటీ సినిమాల వలన ఇప్పుడు మలయాళ స్టార్స్ చాలామంది ఇక్కడి ప్రేక్షకులకు ముందుగానే తెలుసు. ఒకవేళ వారికోసం కాకపోయినా మౌత్ టాక్ వలన థియేటర్లకు జనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాల జాబితాలో ఇది నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.