పార్లమెంట్ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇది ఒక భవనం మాత్రమే కాదని, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, అభిమతాలు, కలలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. భారత పార్లమెంట్ నూతన భవనాన్ని మోడీ నేడు లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ఆయన సన్మానించారు. సర్వమత ప్రార్థనలలో పాల్గొని అనంతరం రాజదండం సెంగోల్ ను పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించారు. ఆ తర్వాత సెంట్రల్ హాల్ లో జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. మోడీతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ నారాయణ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానితో పాటు వేదికపై ఆసీనులై ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ వికసిత భారత్ కు సాక్ష్యంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి దేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు అజరామరంగా నిలుస్తాయని, నేడు మే 28 కూడా సరిగ్గా అలాంటిదేనని స్పష్టం చేశారు.
చోళ వంశంలో న్యాయం, ధర్మం, సుపరిపాలనకు సెంగోల్ ఓ ప్రతీకగా నిలిచిందని, అలాంటి పవిత్ర సెంగోల్ ను పార్లమెంట్ లో ప్రతిష్టించామని తద్వారా దానికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు తిరిగి తెచ్చామని, ఇది మన అదృష్టమని మోడీ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిదని, భారత్ ముందుకు వెళ్తే ప్రపంచం కూడా ముందుకు వెళ్ళినట్లే నని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక వ్యవస్థ మాత్రమే కాదని, ఒక సంస్కారం, ఒక భావం అని మోడీ అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్ళలో నాలుగు కోట్ల మందికి ఇళ్ళు నిర్మించామన్నారు.పాత పార్లమెంట్ లో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని, తగినన్ని సీట్లు కూడా లేవని అన్నారు.
వచ్చే 25 ఏళ్ళలో ఈ పార్లమెంట్ చేసే చట్టాలు భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాయని మోడీ విశాసం వెలిబుచ్చారు. త్వరలో ఎంపి సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు.