తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తన కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ఐపీఎల్ ఫైనల్ తన చివరి మ్యాచ్ అని ప్రకటించాడు, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ కెరీర్ లో రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున మొత్తం 203 మ్యాచ్ లు ఆడి, 4329 రన్స్ సాధించాడు, వీటిలో 22 అర్ధ సెంచరీ లు, ఒక సెంచరీ ఉన్నాయి. ఈ ఫైనల్ అతడికి 204 మ్యాచ్. 2010-17 వరకూ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు, 2013, 2015, 2017లో టైటిల్ గెల్చుకున్న ముంబై జట్టులో ఉన్న అంబటి… 2018నుంచి చెన్నై కు ఆడుతున్నాడు. 2018, 2021లో చెన్నై విజేతగా నిలిచింది. దీనితో మొత్తం ఐదు సార్టు విన్నింగ్ టీం లో ఉన్నాడు.
2019లో వరల్డ్ కప్ కు ఎంపిక చేయనందుకు నిరసనగా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు అంబటి ప్రకటన చేశాడు. ఆ తర్వాత సహచరులు, సీనియర్ ఆటగాళ్ళ సూచనతో దేశవాళీ మ్యాచ్ లు ఆడతానంటూ మనసు మార్చుకున్నాడు. గత ఏడాది కూడా 2022 ఐపీఎల్ తనకు చివరి సీజన్ అని ప్రకటించినా చెన్నై యాజమాన్యం విజ్ఞప్తితో మరో ఏడాది కొనసాగేందుకు అంగీకరించాడు.
అందుకే నేటి రిటైర్మెంట్ ప్రకటనలో ‘ఇక పై తన నిర్ణయంలో యూ టర్న్ ఉండదు’ అంటూ స్పష్టం చేశాడు.
అయితే అంబటి రాజకీయాల్లో చేరతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల అతడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశం కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.