తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా తనకు ఓ ట్రాక్ రికార్డ్ ఉందని, అభివృద్ధి విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిడిపి టిక్కెట్ ఇవ్వకపొతే వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఏ పిట్టల దొరకు ఇచ్చినా ఫర్వాలేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని… తన మనస్తత్వానికి సరిపోయే ఏ పార్టీ అయినా ఒకే అంటూ వ్యాఖ్యానించారు.
మైలవరంలో రూ.32 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన బాలుర హైస్కూల్ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి కేశినేని నాని ప్రారంభించారు, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి నాయకత్వంపై తన అసంతృప్తిని, అసహనాన్ని వెలిబుచ్చారు.
తన మాటలను టిడిపి ఎలా తీసుకున్నా తనకు భయం లేదంటూ కేశినేని తేల్చి చెప్పారు. తాను చేసినన్ని అభివృద్ధి పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదని అన్నారు. ఎంపిగా తనకు వచ్చిన అవకాశంతో ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజలకు మంచి చేయడానికి కృషి చేస్తున్నానని, ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.