మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. వీరి భేటీ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత సీఎం అయిన షిండేతో పవార్ సమావేశమవడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ అనేక ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, ఎన్సీపీ అధినేత మాత్రం ఇది వ్యక్తిగత భేటీ అని క్లారిటీ ఇచ్చారు.
ముంబైలోని మరాఠా మందిర్ 75వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు వెళ్లినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ముంబైలోని మరాఠా మందిర్ 75వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకే సీఎం షిండేను ఆయన అధికారిక నివాసంలో కలిశాను. మహారాష్ట్రలోని మరాఠీ సినిమా, థియేటర్, ఆర్ట్ తదితర రంగాలకు చెందిన కళాకారుల సమస్యలపై సీఎంతో ఈ సమావేశంలో చర్చించాను’ అని పవార్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సీఎం షిండే సైతం ఇదే విషయాన్ని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదని బీజేపీ కూడా వెల్లడించింది.