సిఎం జగన్ డైరెక్షన్ లో సజ్జల రామకృష్ణా రెడ్డి సూచనలతోనే నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. అసలు జగన్ అనుమతి లేనిదే ఇలాంటి దాడి జరిగేందుకు ఆస్కారం ఉంటుందా అని నిలదీశారు. నెల్లూరులో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా టిడిపి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంటిపైకి వచ్చి దాడికి పాల్పడితే ట్రెస్పాస్ కింద కేసు పెట్టారని, హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా 147, 542, రెడ్ విత్ 149 సెక్షన్లు పెట్టారని ఉమా విస్మయం వ్యక్తం చేస్తూ ఆ ఎఫ్ ఐ ఆర్ కాపీని మీడియా ముందు చింపివేశారు. ఆనంపై దాడి జరిగితే జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ దాడికి సుపారీ ఇచ్చింది ఎవరు, గంజాయి బ్యాచ్ ను ఎవరు పంపారో తేల్చాలని, దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసమే సజ్జల ఈ తరహా దాడులు చేయిస్తున్నారని, టిడిపి కేంద్ర కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడుల వెనుక కూడా సజ్జల ఉన్నారని అన్నారు. బాబు ఇంటిపైకి వచ్చిన జోగి రమేష్ కు మంత్రి పదవి ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు.