సిఎం జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమం కంటే వందరెట్లు అధికంగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో… ట్రూ అప్ ఛార్జీలు, ఇంధనం కొనుగోలు పేరిట అక్రమంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆయన ఆరోపించారు. తన అసమర్ధత, నాసిరకం బొగ్గు కొనుగోళ్ళు. కమీషన్ల కోసం కక్కుర్తి వల్లే ఈ భారంమోపాల్సి వచ్చిందన్నారు. ఈ నాలుగేళ్ళలో 57వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపారని వెల్లడించారు.
విద్యుత్ వినియోగం పెరగకపోయినా, బిల్లులు మాత్రం మూడింతలు పెరిగిపోయాయని అన్నారు. తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా, తన అనుయాయులకు మేలు చేసేందుకు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఆభారం ప్రజలపై వేస్తున్నారని కేశవ్ అన్నారు. నాసిరకం బొగ్గు వాడడం వాళ్ళ థర్మల్ స్టేషన్లలో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరింత భారాన్ని మోపేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం దారుణమని, దీనితో మరో ఆరేడేళ్ళ పాటు వినియోగదారుడు ప్రతినెలా కొంత చెల్లించాల్సి వస్తుందని కేశవ్ విశ్లేషించారు. హిందూజా సంస్థనుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా చేయకుండా విడిగా ఎక్కువ రేటుకు కొనాల్సి వస్తుందని, కానీ నిబంధనల ప్రకారం హిందూజాకు 2,200కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
2014లో చంద్రబాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి 22 మిలియన్ యూనిట్ల లోటు విద్యుత్ ఉంటే ఐదేళ్ళ పాలన నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని కేశవ్ గుర్తు చేశారు. 9 వేల మెగావాట్లుగా ఉన్న ఇన్ స్టాల్డ్ కెపాసిటీని 19వేలకు పెంచారని… ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క మెగా వాట్ అయినా అదనంగా పెంచాగాలిగారా అని ప్రశ్నించారు. విద్యుత్ రంగంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.