ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ హాకీ (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రోలీగ్ టోర్నీలో నేడు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 2-3 తేడాతో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇండియా ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు మాత్రం కనబడడం లేదు. ఇండియా, ఇంగ్లాండ్ 27,26 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇండియాకు మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా ఇంగ్లాండ్ మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. గత ఏడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండియా ఈసారి ఛాంపియన్ గా నిలుస్తుందని అందరూ భావించినా ఆ ఆశలు నెరవేరే సూచనలు దాదాపు లేనట్లే అని చెప్పాలి.
నేటి మ్యాచ్ లో 6వ నిమిషంలో నెదర్లాండ్స్ ఆటగాడు ఫీల్డ్ గోల్ చేసి స్కోరు బోణీ కొట్టాడు. 17వ నిమిషంలో ఇండియా ప్లేయర్ సంజయ్ ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. 40,42 నిమిషాల్లో నెదర్లాండ్స్ మరో రెండు గోల్స్ సాధించి స్కోరును 3-1కి తీసుకెళ్ళింది. 45వ నిమిషంలో గుర్జాంత్ సింగ్ మరో అద్భుతమైన ఫీల్డ్ గోల్ సాధించి ఇండియాకు మరో పాయింట్ తెచ్చాడు. 59వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సక్సెస్ చేయడంలో ఇండియా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.
ఈ టోర్నీలో ఇండియా తన చివరి మ్యాచ్ ను అర్జెంటీనాతో రేపు తలపడనుంది.