పెగాసస్ అంశంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. ఆగస్ట్ మొదటివారంలో విచారణ మొదలుపెడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.
పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్. రామ్, శివశంకర్ లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జి లేదా విశ్రాంత జడ్జితో విచారణ నిర్వహించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తామే విచారణ చేపడతామని ప్రకటించింది.
పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ పరికరాలు ఉపయోగించి రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ జర్నలిస్టుల మొబైల్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తుల స్వేచ్చకు భంగం కలిగించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల కోసం వినియోగించాల్సిన ఈ పరికరాలను కేంద్రం దుర్వినియోగం చేసిందని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని విపక్షాలు గత పది రోజులుగా పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తున్న విషయం తెలిసిందే.