హైదరాబాద్ నగరంలోని దుండిగల్‌లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా అధికారులు ఎక్కువ మంది చేరటం వాళ్ళ వైమానిక దళం మరింత బలోపేతం అవుతుందని రాష్ట్రపతి అన్నారు. మహిళా ఫైటర్ పైలెట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్‌లో తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో విహరించినట్లు ఆమె తెలిపారు.
దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో బ్రహ్మపుత్రి, తేజ్‌పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగరడం గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.