తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టుతోపాటు రాజధాని పరిసరాల్లోనీ తీర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. చైన్నైలోని మీనంబాక్కంలో ఉదయం 5.30 గంటల వరకు 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు భారీగా నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Chennai:చెన్నైలో భారీ వర్షం…లోతట్టు ప్రాంతాలు జలమయం
సోమవారం మధ్యాహ్నం వరకు ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. కాగా, భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలకు ఆలస్యమయింది. చెన్నపట్నానికి రావాల్సిన ఆరు విమానాలను బెంగళూరుకు దారిమళ్లించారు. అయితే ఈ నెల 21 వరకు చెన్నై, దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.