ఒక సినిమాకి ఎంతోమంది కలిసి పనిచేయవలసి ఉంటుంది. కొంతమంది ప్రముఖ స్థానాల్లో .. మరికొంతమంది ఆ తరువాత స్థానాల్లో కనిపిస్తూ ఉంటారు. మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకూ ఇక్కడ సినిమాకి అందరూ కావలసిందే. ఎవరు లేకపోయినా ఇక్కడ పని నడవదు. దర్శక నిర్మాతలు .. హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సినిమా అనుకునే పని చేస్తారు. ఆ అంకితభావం లోపించిన ఒకరిద్దరి వలన, ఆ ప్రాజెక్టు విషయాలు బయటికి వెళ్లొచ్చు .. ఒకవేళ వెళ్లకపోయినా ఊహాగానాలు ఉండనే ఉన్నాయి.
అలాంటి రూమర్స్ ఇప్పుడు త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబుకి పూర్తిస్థాయి స్క్రిప్ట్ నచ్చలేదనీ .. అంతా పెర్ఫెక్ట్ గా సెట్ చేసి అప్పుడు కబురు చేయమని చెప్పి సెట్స్ పై నుంచి వెళ్లిపోయాడని ఆ మధ్య ఒక వార్త షికారు చేసింది. ఇక మహేష్ అభిమానులకు ‘గుంటూరు కారం’ టైటిల్ నచ్చలేదంటూ ఈ మధ్య మరో వార్త షికారు చేయడం మొదలుపెట్టింది. అసలు ఇది సినిమా టైటిల్ మాదిరిగా లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోందనే టాక్ మొదలైందని అంటారు.
ఇక ఈ ప్రాజెక్టులో నుంచి పూజ హెగ్డే తప్పుకుందనీ .. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోనున్నారనే రూమర్ ప్రస్తుతం అన్ని చర్చల్లో ప్రధానమైన అంశంగా మారింది. ఇలా రోజుకి ఒక రూమర్ పుట్టుకొస్తుంటే, ప్రతిసారి ఎవరు మీడియా ముందుకువచ్చి ‘ అలాంటిదేం లేదు … అసలేం జరిగిందంటే’ అంటూ చెబుతారు? రూమర్ ఒక వార్త .. అది నిజం కాదనేది మరోవార్త .. అసలు నిజం ఇది అంటూ మరో వార్త .. ఇదీ తంతు. ఇలా క్లారిటీ పేరుతో ఎన్నిరకాలుగా చెప్పినా, ‘ఈ సినిమాకే ఎందుకిలా?’ అంటూ దీర్ఘాలోచన చేసేవారు ఉండనే ఉంటారు.