వెనుకబడిన వర్గాల సమగ్ర అభివ్రుద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని, 17 నూతన బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనం అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
తెలంగాణకు పూర్వం కేవలం 19 బిసి గురుకులాలు అరకొర వసతులతో ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో వాటిని నేడు 327కు పెంచుకున్నామన్నారు. కేవలం బిసి గురుకులాల ద్వారానే రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తారని ఆనందం వ్యక్తం చేసారు.
గత సంవత్సరమే 15 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసుకొని క్లాసులు ప్రారంభించుకున్నామని వాటి ద్వారా 15,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఈ సంవత్సరం ప్రారంభించే డిగ్రీ కాలేజీల్లో 16,320 మందికి లబ్దీ చేకూరుతుందన్నారు. కేవలం డిగ్రీ గురుకులాల్లోనే 31,680 మందికి ప్రపంచస్థాయి విద్యను అందిస్తామన్నారు మంత్రి గంగుల. ఈ నూతన డిగ్రీకాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బిసి గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటవుతుందన్నారు.
ఈ ఏడు ప్రారంభించబోయే బిసి డిగ్రీ గురుకులాల్ని జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదిలాబాద్, కొమరంబీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్..
లక్ష సాయం దరఖాస్తుల పరిశీలన
వెనుకబడిన వర్గాల లక్ష సహాయం కోసం క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభమయిందని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేసారు. మొత్తం 5,28,862 అప్లికేషన్లు వచ్చాయని, వర్గాల వారిగా బిసిఏ 2,66,001, బిసిబి 1,85,136, బిసిడి 65,310 ఎంబిసిలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తుల క్రమసంఖ్య ప్రకారం పరిశీలన కొనసాగుతుందన్నారు, ప్రతీ నెల 5వ తారీఖు వరకు వెరిఫికేషన్ పూర్తైన వారికి అదేనెల 15వ తారీఖున స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్.