కెన్యా పశ్చిమ ప్రాంతంలోని లోండియానిలో ఉన్న రిఫ్ట్ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు పట్టణాల మధ్య హైవేపై బస్‌స్టాప్‌లో వేచి ఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత విభాగాల అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ధ్వంసమైన వాహన శకలాల కింద మరికొంత మంది చిక్కుకొని ఉన్నారని పోలీసులు తెలిపారు. వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యల్లో అంతరాయం ఏర్పడింది. కాగా, ప్రమాద ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు చేపడటామని రవాణా మంత్రి కిప్‌చుంబా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.