నెదర్లాండ్స్ జట్టు ప్రపంచ కప్ కు అర్హత సంపాదించింది. ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ -2023 క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశలో నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై 4 వికెట్లతో గెలుపొందింది. టాప్-10లో చివరి రెండు స్థానాల కోసం జరుగుతోన్న ఈ పోటీల్లో ఇప్పటికే శ్రీలంక అర్హత సంపాదించగా, నెదర్లాండ్స్ రెండో జట్టు అయ్యింది. నెదర్లాండ్స్ అల్ రౌండర్ బాస్ డే లీడ్ ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 123 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
బులావాయో స్పోర్ట్స్ క్లబ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో నెదర్లండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేయగా… స్కాట్లాండ్ కంటే మెరుగైన రన్ రేట్ కోసం 44 ఓవర్లలోనే విజయం సాధించాల్సి ఉండగా, 42.5 ఓవర్లలో నే డచ్ జట్టు గెలుపొంది బెర్త్ సొంతం చేసుకుంది.
స్కాట్లాండ్ లో బ్రాండన్ మెక్ ముల్లెన్-106; కెప్టెన్ బెర్రింగ్టన్-64; టామస్ మాకింతోష్-38; క్రిస్టోఫర్ మెక్ బ్రైడ్-32 పరుగులు చేశారు. డచ్ బౌలర్లలో బాస్ డే లీడ్ 5; రియాన్ క్లీన్ 2; వాన్ బీక్ ఒక వికెట్ పడగొట్టారు.
నెదర్లాండ్స్ జట్టులో బాస్ డే లీడ్ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేసి విజయం ముంగిట రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో విక్రమ్ జిత్ సింగ్-40; షకీబ్ జుల్ఫిఖర్-33; స్కాట్ ఎడ్వర్డ్స్-25 రన్స్ చేశారు.