దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షం ముంచెత్తింది. గత 20 ఏండ్లలో గరిష్ట వర్షపాతం నమోదైంది. దీంతో నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. చెట్లు కూలిపోయాయి. వాహనాలు దెబ్బ తిన్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
2003 జూలై 10న 133.4 ఎంఎం వర్షపాతం నమోదు కాగా, శనివారం 126.1 మిమీ వర్షపాతం రికార్డయింది. 1958 జూలై 21న 266.2 మిమీ ఆల్ టైం రికార్డు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షం కురవడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర పరిధిలో ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.