కడప స్టీల్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు జూలై 15నాటికి వచ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత ప్లాంట్ పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. గండికోట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సిఎం జగన్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ఈ విషయాన్ని తెలియజేశారు.
గండికోటను గ్రాండ్ కానియన్ అఫ్ ఇండియా గా పిలుచుకుంటామని, ఇలాంటి ప్రదేశంలో ఒబెరాయ్ గ్రూప్ సూపర్ లగ్జరీ హోటల్ కట్టడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. ఇలాటి పెద్ద పెద్ద గ్రూప్స్ ఇక్కడకు రావడం ద్వారా గండికోటను ప్రపంచ టూరిజం మ్యాప్ లోకి తీసుకు వెళ్ళవచ్చన్నారు. దీని ద్వారా 800 మంది వరకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇది సెవెన్ స్టార్ హోటల్ అవుతుందని, గండికోటతో పాటు తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. గండికోటలో ఒబెరాయ్ గ్రూప్ గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, తద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు.
“రేపు కొప్పర్తిలో డిక్స్‌న్ కంపెనీకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నాం. కొప్పర్తిలో డిక్సన్ గ్రూపు 1000పైగా ఉద్యోగాలు ఇచ్చారు. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఛానల్ ప్లే అనే మరో కంపెనీ… హోం ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నాం. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి” అంటూ సిఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే టెక్నో డామ్ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేసుకుంటున్నామని, దీని ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సిఎం వివరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ జిత్ సింగ్ ఒబరాయ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.