బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రెండో టి 20 లో బంగ్లాదేశ్ మహిళా జట్టుపై ఇండియా మహిళల జట్టు 8 పరుగులతో అద్భుత విజయం అందుకుని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టి 20 సిరీస్ ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 95 పరుగులు మాత్రమే చేసిన ఇండియా ఈ లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది.
ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా స్కోరు ౩౩ వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. స్మృతి మందానా-19; షఫాలీ వర్మ-13 పరుగులు చేసి వెనుదిరగ్గా కెప్టెన్ హర్మన్ ప్రీత్ డకౌట్ అయ్యింది. ఆ తర్వాత అమన్ జోత్ కౌర్-14; యశ్తిక భాటియా-11; దీప్తి శర్మ-10 రన్స్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతున్ 3; ఫాహిమా ఖాతూన్ 2; ముర్ఫా అక్తర్, నహిదా అక్తర్, రాబెయా ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారత మహిళల బౌలింగ్ దెబ్బకు బంగ్లా కూడా 30 పరుగులకే నాలుగు వికెట్లు (షమీమా సుల్తానా-5; సత్తి రాణి-5; ముర్షీదా ఖాతూన్-4; రీతూ మోనీ-4) కోల్పోయింది, జట్టులో కెప్టెన్ సుల్తానా ఒక్కరే 38 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరు చేసింది. షఫాలీ వర్మ వేసిన చివరి ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. 20 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌట్ అయ్యింది.