బిజెపిని ఎదుర్కునేందుకు నెమ్మదిగానైనా విపక్షాలు ఒక్కతాటిన నిలిచేందుకు సిద్దం అవుతున్నాయి. కేంద్రంలో బిజెపిని గద్దె దించటమే లక్ష్యంగా విపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు. బెంగళూర్‌లో జరుగుతున్న విపక్షాల భేటీలో రెండో రోజు మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేస్తున్నారు. సమిష్టిగా తీసుకోవాల్సిన అంశాలపై బ్లూప్రింట్ తయారుచేసేందుకు కమిటీ ఏర్పాటు కానుంది.
కనీస ఉమ్మడి కార్యక్రమం స్ధానంలో లేవనెత్తాల్సిన ఉమ్మడి అంశాలను గుర్తించి జాబితా రూపొందించేందుకు కమిటీని నియమించే అవకాశం ఉంది. ఇక యూపీఏ పేరు మార్పు విషయంలోనూ విపక్షాల సమావేశంలో నేతలు కసరత్తు చేశారు. నాలుగైదు పేర్లను పరిశీలిస్తున్న నేతలు చివరకు ఇండియా అని కొత్త కూటమికి నామకరణం చేశారు. INDIA – Indian National Democratic Inclusive Alliance. కూటమి పేరులో ఫ్రంట్ అనే పదం వాడరాదని టీఎంసీ సూచించింది.
ఇక బెంగళూర్‌లో విపక్ష సమావేశం రెండో రోజు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకె ఎంపీ టీఆర్ బాలు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ మృతికి నేతలు సంతాపం ప్రకటించారు. దివంగత నేత మృతికి సంతాపంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఎన్ డి ఏ మిత్ర పక్ష కూటమి సమావేశానికి 38 పార్టీలకు ఆహ్వానం అందింది.