జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంత్‌నాగ్‌లో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని, కోలుకుంటున్నారని చెప్పారు. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
ఈ నెల 13న షోపియాన్ జిల్లాలోని గాగ్రెన్ ప్రాంతంలో ముగ్గురు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక పూంచ్ జిల్లా సింధారాలో మంగళవారం భారత ఆర్మీ, జమ్ము పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా విదేశీ టెర్రరిస్టులని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.