దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో యమునా నది ప్రవాహం మళ్లీ ప్రమాదకర స్థాయికి (205.72 అడుగులు) చేరుకుంది. బుధవారం కురిసిన భారీ వర్షం ధాటికి ముంబై నగరం తడిసిముద్దయింది. భాండుప్‌లో భవనం కూలి ఐదేండ్ల బాలుడు మృతిచెందాడు. నాలుగు నెలల పాప నాలాలో కొట్టుకుపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం ముంబై, థానెలకు యెల్లో అలర్ట్, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లకు రెడ్ అలర్ట్ జారీచేసింది. ఔరంగాబాద్, లాతూర్ జిల్లాల్ని భారీ వర్షాలు చుట్టుముట్టాయి. జాల్నా, బీడ్, ఉస్మానాబాద్, పర్భని, హింగోలి, నాందేడ్‌లలో బుధవారం రికార్డ్‌స్థాయిలో వర్షం కురిసింది.
ఉత్తరాఖండ్, హిమాచల్‌లో ఈనెల 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనావేసింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరోచోట కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. కాలాపానీలో ఇనుప వంతెన కొట్టుకుపోయింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమ్‌నాథ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. సౌరాష్ట్ర, జునాగఢ్, వల్సాద్, సూరత్‌లో జనజీవనం స్తంభించిపోయింది. వాహనాలు కొట్టుకుపోయాయి.