ట్రినిడాడ్ టెస్టులో వెస్టిండీస్ కు 365 పరుగుల లక్ష్యాన్ని ఇండియా నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 229 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన విండీస్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకు 255 పరుగులకే కుప్పకూలింది. నేటి ఐదు వికెట్లూ సిరాజ్ కె దక్కడం గమనార్హం.
183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా తొలి వికెట్ లు 98 పరుగులు చేసింది. విండీస్ కు లక్ష్యం నిర్దేశించే దిశగా ఆటగాళ్ళు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడారు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జైశ్వాల్ కూడా(38, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్)వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ వేగంగా ఆడగా, మరో ఎండ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ ఆచి తూచి ఆడాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52; గిల్-29 పరుగులతో ఆడుతుండగా, ఇషాన్ అర్ధ శతకం పూర్తి కాగానే, జట్టు స్కోరు 181 వద్ద కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 38 వద్ద బ్రాత్ వైట్ (28) వికెట్ కోల్పోయింది. కిర్క్ మెకంజీ డకౌట్ గా వెనుదిరిగాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లూ అశ్విన్ కే దక్కాయి.
చివరిరోజు 289 పరుగులు అవసరం కాగా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.