క్రమశిక్షణ, కట్టుదిట్టమైన చట్టాలకు నిదర్శనం సింగపూర్. సింగపూర్ లో చట్టం అతిక్రమిస్తే శిక్షలు కటినంగా ఉంటాయి. తాజాగా మాదకద్రవ్యాల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న 45 ఏళ్ల సారిదేవి జమానిని ఇవాళ సింగపూర్ లో ఉరి తీశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ దేశంలో ఓ మహిళను ఉరితీయడం ఇదే మొదటిసారి. 2018లో సుమారు 30 కేజీల హెరాయిన్‌ను సరఫరా చేస్తూ ఆమె పట్టుబడింది. గత వారం రోజుల్లో మరణ దండన ఎదుర్కొన్న రెండవ డ్రగ్ నేరస్థురాలు ఆమె. సింగపూర్‌లో డ్రగ్స్ నివారణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నారు. దాదాపు 15 కేజీల హెరాయిన్ దొరికితే, అలాంటి నిందితులకు సింగపూర్‌లో మరణశిక్ష అమలు చేస్తారు.
2018 జూలై ఆరవ తేదీన సారిదేవికి మరణశిక్ష విధించినట్లు సింగపూర్‌కు చెందిన సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో పేర్కొన్నది. అయితే చట్ట ప్రకారమే ఆమెను ఉరితీసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను కొట్టిపారేశారు. రెండు రోజుల క్రితం అజిజ్ అనే వ్యక్తిని కూడా ఉరితీశారు. 2017లో 50 కేజీల హెరాయిన్‌తో అతను పట్టుబడ్డాడు.