బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది. రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తున్నదన్నారు. కిషన్‌గంజ్, కలిహార్‌ను అనుసంధానం చేసే ఈ వంతెనను మెచ్చి నదిపై నిర్మిస్తున్నట్లు చెప్పారు.
కాగా, జూన్ 4న బీహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. ఖగారియా జిల్లాను భాగల్పూర్‌తో అనుసంధానించే ఆ వంతెన పేకముక్కలా పడిపోయింది. ఈ సంఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు మరణించాడు. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఆ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై బీహార్ ఇంజినీరింగ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పూర్తైన, నిర్మాణంలో ఉన్న అన్ని వంతెనలకు ‘స్ట్రక్చరల్ ఆడిట్’ నిర్వహించాలని డిమాండ్ చేసింది.