అగ్రదేశాలకు దీటుగా అభివృద్ధి పథంలో సాగుతున్న ఇజ్రాయెల్ లో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం విమర్శలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రజల ఆందోళనల నడుమే దీనిని ఆమోదించింది. కోర్టుల పరిధిని తగ్గిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం న్యాయ సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగానే సర్వోన్నత న్యాయస్థానం అధికారాలకు కత్తెర వేస్తూ తాజాగా బిల్లును ఆమోదించింది. అయితే ఈ సంస్కరణలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తాజా సంస్కరణల ప్రకారం.. ఇకపై క్యాబినెట్ నిర్ణయాలు, నియామకాలను కోర్టులు పరిశీలించేందుకు వీలుండదు. దీనిపై నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల నిర్ణయాలను పర్యవేక్షించేందుకు కోర్టులకు అధికారం లేకుండా పోతుందని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
అరబ్బు దేశాలతో నిత్యం గొడవలు ఉండే ఇజ్రాయెల్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. ఇటీవల ముస్లీం దేశాలతో స్నేహ హస్తం, పౌరుల తిరుగులేని దేశభక్తి, అంతులేని సైనిక సంపత్తి ప్రభుత్వాలను నియంతృత్వం వైపు నడిచేలా చేస్తున్నాయి. సుప్రీం కోర్టు అధికారాలలో కోత వేయటం ఇజ్రాయెల్ పతనానికి నాందీగా పేర్కొనవచ్చు.