Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

What a faith:

“శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు”-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న.

ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి బతుకే కుక్క కంటే హీనంగా ఉంది. తెలుగు భాష నిండా కుక్కపరిభాష నిందార్థంలోనే ఉంది. దీన్ని ఆధునిక శునక సుఖజీవన ప్రమాణాల ప్రకారం పునర్నిర్వచించాల్సిన అవసరముంది.
కుక్క బతుకు;
కుక్క చావు;
కుక్కను కొట్టినట్లు కొట్టడం;
కుక్కలా పడి ఉండడం;
కుక్కకున్న విశ్వాసం కూడా లేకపోవడం;
కుక్క తోక వంకర;
కుక్కకాటుకు చెప్పు దెబ్బ- ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగు భాష, సామెతల నిండా కుక్కలే కుక్కలు.

Dog Waited Salem Hospital

వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అని ఇందులో ప్రధానంగా రెండు రకాలు. లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్, జర్మన్ షెపర్డ్, బిగిల్ , హౌండ్స్ ఇంకా నానాజాతిపేర్లు వాటి బ్రీడ్ నుబట్టి, పుట్టిన దేశాలనుబట్టి వచ్చిన పేర్లు. కుక్కను పెంచుకునేవారు సాధారణంగా కుక్కను కుక్క అనరు. దానికి నామకరణ మహోత్సవం ఎస్ వీ ఆర్ చెప్పినట్లు నేత్రోత్సవంగా చేసి ఉంటారు కాబట్టి ఆ పేరుతోనే గౌరవంగా, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.

“మా యజమానులు కుక్కలను చూసుకుంటున్నారు;
వారి పిల్లలను మేము చూసుకుంటున్నాం;
మమ్మల్ను ఎవరూ చూసుకోరు”– అని కలవారి ఇళ్లల్లో పనిమనుషులు స్వగతంలో విసుక్కుంటూ ఉంటారని లోక అపవాదం.

వీధి కుక్కల బతుకు పోరాటం సరిగ్గా గుర్తింపు పొందలేదేమో అనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాస తరగతుల్లో వీధి కుక్కల పాఠాలు స్ఫూర్తిదాయకం కాగలవు.

వీధి కుక్క అన్న మాటలోనే భౌగోళికమయిన సరిహద్దు స్పష్టంగా ఉంది. ఆ వీధి, లేదా ఆ ఏరియా దాని సరిహద్దు. ఒక వీధి కుక్క ఇంకో వీధిలోకి వెళ్లదు. ఆధార్, జి పి ఎస్ ట్యాగ్ లైన్, ప్రాపర్టీ టాక్స్ పిన్ నంబర్లలాంటివేవీ లేకపోయినా వీధికుక్కలు తమ పర్మనెంట్ అడ్రెస్ విషయంలో కన్ఫ్యూజ్ కావు. అవతలి కుక్కలను కన్ఫ్యూజ్ చేయవు. పెంపుడు కుక్కల్లాగా యజమానులు వేళకింత పడేస్తే తిని మన్ను తిన్న పాముల్లా కనీసం తోక కూడా ఊపకుండా పడి ఉండాల్సిన అవసరం కానీ, అంతటి దీన స్థితి కానీ వీధి కుక్కలకు ఉండదు. తమతో మాట్లాడేవారితో మాట్లాడుతూ, తమను పట్టించుకోనివారిని పట్టించుకోకుండా ఉండే నిర్నిబంధమయిన స్వేచ్ఛ వీధి కుక్కలకు ఉంటుంది. ఎప్పుడూ గొలుసులు, తాళ్లతో బందీలయిన పెంపుడు కుక్కలు వీధి కుక్కల స్వేచ్చా స్వతంత్రాలు చూసి అసూయపడతాయి. వ్యాక్సిన్లు, టీకాలు, ప్రోటీన్ ఫుడ్ అంటే ఏమిటో వీధికుక్కలకు తెలియకపోయినా, ఎప్పుడూ వాడకపోయినా వీధికుక్కలు ఆరోగ్యంగానే ఉంటాయి. ఒకవేళ రోగమొస్తే పెంపుడు కుక్కల్లా వెటర్నరీ ఆసుపత్రికి వెళ్లి క్యూలో నిలుచోవు. రెండ్రోజులు మూలన కూర్చుని రెస్ట్ తీసుకుని మందుమాకు లేకుండానే రోగాన్ని నయం చేసుకుని మళ్లీ వీధిమీద పడతాయి.

కుక్క మనకు కాపలా అని మన నమ్మకం. నమ్మకాలెపుడూ డిబేటబుల్. కుక్కకు మనం కాపలానా? లేక మనకు కుక్క కాపలానా? అనేది కుక్కలను పెంచుకునేవారినడిగితే కరవకుండా చెబుతారు.

వీధికుక్కలు- పెంపుడు కుక్కలకే తలవాచిపోతే ఇక అడవికుక్కల గురించి వింటే అడవులపాలయిపోతాం. అడవికుక్క సింహంతో సమానం. అది ఊళ్లోకి రావడంవల్ల గ్రామసింహం అయ్యింది.

Dog Waited Salem Hospital

అపార్టుమెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో మనుషుల పేర్లు వాడ్డం మానేసి లాబ్రడార్ వాళ్ల ఇల్లు, బొచ్చుకుక్క వాళ్ల ఇల్లు, రెండుకుక్కల వాళ్ల ఇల్లు అని కుక్కగుర్తుగా పనిమనుషులు, సెక్యూరిటీవారు చెప్పుకుంటూ ఉంటారు.

“కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!”
బంగారపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా…కుక్క కుక్కే అని సుమతీ శతకకారుడు తేల్చి పారేశాడు.

“చెప్పు తీపెరుగు కుక్క చెరకు తీపెరుగునా”
అన్న సామెత మీద అఖిలభారత శునక సమాఖ్య అనాదిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా…సామెత మనుగడలోనే ఉంది.

కుక్క తనను తాను ప్రేమించుకుంటుందో లేదో కానీ తన యజమానిని మాత్రం అమితంగా ప్రేమిస్తూ ఉంటుందని కుక్కల సారీ… వెటర్నరీ డాక్టర్లు చెబుతూ ఉంటారు. పెంపుడు కుక్కలను ఇంట్లో కుటుంబసభ్యులతో సమానంగా చూడడం సహజం.

“కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి
ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను

కంటిపాప కంటె యెంతో గారవించెను
దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను…

కూరిమి గలవారంత కొడుకులేనురా!
జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా…కుక్క మేలురా…”

అని ఘంటసాల ఎప్పుడో పాడాడు. ఆ పాటలో ప్రతి మాటను అక్షరసత్యం చేస్తోంది తమిళనాడు సేలం జిల్లాలో ఒక ఆసుపత్రి గుమ్మం ముందు మూడు నెలలుగా ఒక కుక్క. తనను పెంచిన యజమాని గుండెపోటుతో మోహన్ కుమార మంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజులు అపస్మారక దశలో ఉన్నాడు. మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. శవాన్ని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. యజమాని కోసం వీధి వీధిలో వెతుక్కుంటూ ఇల్లు వదిలిన ఈ కుక్క ఎలాగో ఆసుపత్రిని కనుక్కోగలిగింది. ఆసుపత్రి గుమ్మం దాటి బయటికి రాగానే తన యజమానిని పలకరిద్దామని అక్కడే కాళ్లు ముడుచుకుని కూర్చుంది. విషయం తెలిసిన ఆసుపత్రి సిబ్బంది మనసు కరిగి ఆహారం పెడుతున్నారు. రెండ్రోజులు చూసి వెళ్లిపోతుందిలే అనుకున్నారు. కానీ…మూడు నెలలుగా ఆ కుక్క ఆ ఆసుపత్రి గుమ్మంలోనే తన యజమాని రాక కోసం దిగులు దిగులుగా ఎదురు చూస్తోంది.

మంగళం బంధువులు ఆయన కోసం ఎంతగా విలపించారో కానీ…
పెంచుకున్న ఈ కుక్క బాధ తెలిసిన మంగళం ఆత్మ మాత్రం నిజంగా పొంగిపోయి ఉంటుంది.

“ఋణానుబంధ రూపేణ! పశు పత్ని సుతాలయాః! ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!”

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

డాగ్స్ మస్ట్ బి క్రేజీ!

Also Read :

శునకాయ ప్రవేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com