Thursday, March 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపులి చెప్పిన పులిహోర పురాణం

పులి చెప్పిన పులిహోర పురాణం

పులి జాతిలో అనేక ఉప జాతులున్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి పులుల స్వరూపంలో, పిలిచే పేర్లలో కొంచెం తేడాలుంటాయి కానీ…స్వభావంలో మాత్రం తేడాలుండవు. ఉంటే అవి పులులు కావు.

“ఇంట్లో పులి- వీధిలో పిల్లి” అన్న సామెత తెలియక దక్షిణాఫ్రికా ఇంటి పులులు విమానమెక్కి, హెలిక్యాప్టర్లు ఎక్కి,…మధ్యప్రదేశ్ వీధుల్లోకి వచ్చేసరికి…పాపం నిజంగానే బిగ్ క్యాట్- పెద్ద పిల్లులయి…పిల్లగాలులకు కూడా నిలువెల్లా వణికిపోతున్నాయి.

“పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు…” అని ఇదివరకు ఏ జంతువులయినా కృత్రిమంగా వాతలు పెట్టుకుంటే…పులులు వెంటనే పసిగట్టగలిగేవి. ఇప్పుడు “పులితోలు కప్పుకున్న మేకలకు” కూడా పులులు భయపడి చస్తున్నాయి.

పులులకంటే “మేకవన్నె పులులు” మరీ ప్రమాదం అని దక్షిణాఫ్రికాలో విమానమెక్కే ముందు పెంచిన ప్రేమతో జూ నిర్వాహకులు, అటవీ శాఖవారు జాగ్రత్తలు చెప్పి పంపారట. అకెడెమిక్ విజ్ఞానం వేరు. ప్రాక్టికల్ విజ్ఞానం వేరు.

కళ్లకు గంతలు కట్టి, కాళ్లకు తాళ్లను కట్టి, మత్తు సిరంజులు ఇచ్చి, ఇనుప బోనుల్లో బంధించి, ఆ బోనును మళ్లీ ఒక చెక్క పెట్టెలో దించి, చుట్టూ సి సి కెమెరాలు పెట్టి...పైన డ్రోన్ కెమెరాలు ఎగురుతుండగా…కట్టుదిట్టమయిన భద్రత నడుమ “కునో” వనప్రవేశం చేయించడాన్ని చూసి ఆఫ్రికా పులులు నవ్వుకుంటున్నాయి.

కునోలో మత్తు దిగిన తరువాత పన్నెండు పులులు సామూహికంగా జూ కీపర్ ను పిలిచాయి. భాష, తిండి సమస్య అయి ఉంటుందిలే అని అనుకుని జూ కీపర్ పది పది కేజీల ఫ్రెష్ మాంసంతో బోనులో బంధించి ఉన్న వాటి ముందుకు ధైర్యంగా వెళ్లాడు. జెట్ లాగ్ తో కడుపులో తిప్పుతోంది. కళ్లు తిరుగుతున్నాయి. మాంసం తినలేము. కొబ్బరి నీళ్లు ఇప్పించండి…చాలు...అన్నాయి పులులు నీరసంగా. రక్తం తాగే పులులను చూసి చూసి విసిగిపోయిన కీపర్ కు కళ్లల్లో నిజంగా రక్తం వచ్చింది. వేదభూమి, మహాకాళేశ్వరుడి పీఠభూమిలో అడుగుపెట్టిన పులులు కూడా తీర్ధప్రసాదాలే అడుగుతున్నాయి…అని మురిసిపోతూ…వెంటనే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పులుల సాత్విక పరిణామాన్ని పులకింతగా వివరించి చెప్పాడు.

రెండు గుటకలు కొబ్బరి నీళ్లు తాగిన పులులు కొంచెం స్థిమితపడి…మేము మీడియాతో మాట్లాడాలి…లైవ్ కవరేజ్ కు ఏర్పాట్లు చేయగలరా? అని అభ్యర్థించాయి. భారత ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడము అని హామీ ఇస్తే…పై అధికారుల అనుమతి తీసుకుంటాను…అసలే బి బి సి డాక్యుమెంటరీతో చస్తున్నాం…అన్నాడు. పులులు సరే అన్నాయి. పై అధికారులు కూడా సరే అన్నారు.

కెమెరాలు, లైట్లు, మైకులు, లైవ్ డి ఎస్ ఎన్ జి, ఓ బి వ్యాన్లు అన్నీ సిద్ధం. దక్షిణాఫ్రికా చాలా కాలం పాటు బ్రిటీషు వారి చెప్పు చేతల్లో ఉండడం వల్ల ఆ పులులు చక్కటి ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నాయి.

“పులికి ప్రాస కుదిరిందని పులిహోర ఫుడ్డు పెట్టినప్పుడే మాకు కునో వన సీమలో జరగబోయే అతిథి మర్యాదల మీద పూర్తీ క్లారిటీ వచ్చింది. పులి చర్మం, పులి గోళ్ల కోసం పులుల జాతినే ఇంగువకట్టిన గుడ్డ చేసిన మీ “పులి ప్రేమ” మాకు సింహస్వప్నంలా ఉంది. పులులను వేటాడి…చచ్చిన పులిని కాళ్ల ముందు వేసుకుని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకుని ఇంటి గుమ్మాలకు వేలాడదీసుకునే మహారాజులు లేకుంటే…మా సోదర పులులు వాటి మానాన అవి భారత్ లో కూడా బతికి ఉండేవి. మేము దక్షిణాఫ్రికా నుండి రావాల్సిన పని ఉండేది కాదు.

అయినా అడవిలో పులులయిన మమ్మల్ను చూడ్డానికి మీరిలా ఎగబడడం ఏమీ బాగోలేదు. జనారణ్యంలో, మీ మీ ఊళ్లల్లో మా కన్నా వాడి అయిన గోళ్లతో రక్కే మానవ మృగాలు లేవా? కండ పీక్కు తినే మానవ పులులు లేవా? వేల, లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే మేకవన్నె పులులు లేవా? మనుషుల మెదడు తినే వ్యాఘ్ర పురుషులు లేరా? పురుష వ్యాఘ్రాలు లేవా?

‘ఏ పులి మేకను రక్షిస్తుంది?’

‘పులి చంపిన లేడి నెత్తురు…’

అని కవితల నిండా మమ్మల్ను అధివాస్తవిక దృక్పథంతో అత్యంత క్రూరులుగా చిత్రీకరించి…మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. పొయెటిక్ జస్టిస్- కవితా న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

‘ఈ సమాజం ఏ పులిని బతకనిచ్చింది?’

‘పులిని చంపిన మనుషులు..’

లాంటి వాస్తవిక దృక్పథంతో ఆధునిక కవితలు రాయాలని కవికుల తిలకులకు మా సూచన.

‘గోముఖ వ్యాఘ్రం’ అని తిట్టుకు మమ్మల్ను- గంగిగోవులను అనవసరంగా కలిపి మా మధ్య లేనిపోని కమ్యూనికేషన్ గ్యాప్ తో వైషమ్యాలను పెంచారు.

చారలున్నది పులి.
మచ్చలున్నది చిరుత లేదా చీతా.
ఏమీ లేనిది పాంథర్, జాగ్వార్…అని ఏదో మీకు తెలిసిన వ్యాఘ్ర విజ్ఞానంతో మమ్మల్ను విభజించి పాలించారు.

‘పులినోట్లో తల పెట్టినట్లు’ ఉంది మా పరిస్థితి.

పెరుగన్నం తిని…చెరుకు రసం తాగే వేళయ్యింది. వస్తాం…”

అని పదునయిన గోళ్ల కాళ్ళెత్తి నమస్కరించి పులులు వెళ్లిపోయాయి. కంటికి మంటికి ఏకధారగా జర్నలిస్టుల కళ్లల్లో నీళ్లు కురుస్తున్నాయి. జూ కీపర్ కాషాయ వస్త్రాలు కప్పుకుని అప్పటికప్పుడే సన్యాసం స్వీకరించాడు. ప్రత్యక్షప్రసారం చూస్తున్న ప్రేక్షకులందరూ ఇళ్లల్లో పిల్లులను తరిమేసి…పులులను పెంచుకోవాలని సంకల్పం చెప్పుకుని…పులుల వేటకు బయలుదేరారు!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

RELATED ARTICLES

Most Popular

న్యూస్