Fire In Niger Has Killed At Least 30 Students :
పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ దేశంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 30 మంది పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. రాజధాని నియామీ దగ్గరలోని మరాడి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటైన నైగర్ లో పాఠశాల భవనాలు లేక పూరిపాకల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. గుడిసెలతో కూడిన క్లాసు రూమ్ లలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో అర్థం కాని విద్యార్థులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా సుమారు పదిమంది సజీవ దహనమయ్యారు.
ఇదే ఏడాది ఏప్రిల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది స్కూల్ విద్యార్థులు చనిపోయారు. స్కూల్స్ కు పక్కా భవనాలు లేకపోవటంతో దినమొక గండంగా గడుస్తోందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నైగర్ దేశంలో పాఠశాలలు విద్యార్థుల పాలిత యమపాశాలుగా మారాయని స్వచ్చంద సంస్థలు నిరసన కార్యక్రమాలు చేయటంతో అన్ని స్కూల్స్ కు పక్కా భవనాలు నిర్మిస్తామని అపుడు దేశాధ్యక్షుడు మొహమ్మద్ బజౌం హామీ ఇచ్చారు. దేశాధ్యక్షుడి హామీ అమలులోకి రాక ముందే మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నైగర్ దేశంలో 80 శాతం భూభాగం సహారా ఎడారిలో ఉంటుంది. ముస్లీం జనాభా ఎక్కువగా ఉండే ఈ దేశంలో మొదటి నుంచి అధికారం కోసం వివిధ వర్గాల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి. మతం పేరుతో మూడ ఆచారాలు పాటించే ప్రజలు అధికం. దీంతో అడ్డు అదుపు లేని జనాభా పెరుగుదల, ప్రతి ఏటా అనావృష్టి దేశానికి శాపంగా మారాయి. ఐక్యరాజ్యసమితి జీవన ప్రమాణాల సూచి ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉండే నైగర్ లో అవినీతి, పేదరికం విలయ తాండవం చేస్తున్నాయి.