జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు వేకువ జామున ప్రజలు తీవ్ర భయ భ్రాంతులకు లోనయ్యారు. రాజౌరీలో స్వల్ప భూకంపం వచ్చింది. ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లోని దోఢా ప్రాంతంలో ఈ నెల 8న అర్ధరాత్రి దాటిన తర్వాత 12.04 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఆగస్టు 4న గుల్‌మార్గ్‌లో 5.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఎన్‌సీఎస్ వెల్లడించింది.