సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది. ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్‌పై కేసు నమోదైంది. అయితే, ఆ కేసులో గుజరాత్ ఏటీఎస్ తీస్తాను అదుపులోకి తీసుకుంది.
రెండు నెలల పాటు ఆమె జైలులో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తీస్తా సీతల్వాడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో తీస్తా సీతల్వాడ్‌కు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు. సాధారణ బెయిల్ కోసం తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇందుకు తిరస్కరించింది. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.