అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ అంతర్గత కుమ్ములాటలతో అట్టుడుకుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న కుమ్ములాటలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పేదరికం విలయ తాండవం చేస్తోంది. ఈ తరుణంలో యెమన్ రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ సందర్భంగా సనాలో ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో 85 మందికిపైగా మరణించారు. 322 మందికిపైగా గాయపడ్డారు.
రంజాన్ సందర్భంగా సనాలోని బాల్ అల్-యెమెన్ ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. దీంతో ఆర్థిక సాయం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. అదికాస్త తొక్కిసలాటకు దారితీయడంతో 85 మందికిపైగా మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని హుతి సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 322 మందికి పైగా గాయపడగా, వారందరిని సమీపంలోని దవాఖానలకు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
పెద్దసంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోవడంతో వారి సంబంధీకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని హుతి అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. కొందరు వ్యాపారులు ప్రజలకు ఆర్థిక సాయం చేయడానికి ఈ కార్యక్రామన్ని ఏర్పాటు చేశారన్నారు. నెల రోజుల్లో పాకిస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్, కరాచీల్లో గోధుమ పిండి పంపిణీ, నిత్యావసరాల ఉచిత పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటల్లో సుమారు 40 మంది చనిపోయారు.