దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. జోహెన్నస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ సమీపంలో గల అనధికారిక సెటిల్ మెంట్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు.
South Africa: దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్…16 మంది మృతి
ఘటన సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ సేవలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విషపూరితమైన గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజ్ అయినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.