Sunday, January 19, 2025
Homeజాతీయంఆ భర్త అంత పని చేశాడా?

ఆ భర్త అంత పని చేశాడా?

…కాదా మరి?
గుండె రగిలిపోదా?
ఊపిరి ఆగిపోదా?
నిలువెల్లా నీరుగారి పోరా?
కాళ్ల కింద భూమి నిలువునా చీలి పోదా?
కులగిరులు కుంగిపోవా?
సప్త సముద్రాలు పొంగిపోవా?

తన గురించి తాను ఏమనుకుంటున్నాడు ఆ నిరుపేద భర్త?
ఏదో రోడ్డు పక్కన రేకుల డాబా నడుపుకుంటూ ఏ పూటకాపూట జీవనం సాగిస్తుంటే…
భార్య లేని వేళ…సందు చూసి…ఇంత పని చేస్తాడా?
రేపటి మీద ఆశ ఉన్నవాళ్లు ఎవరయినా చేయాల్సిన పనేనా ఇది?

ఇంట్లో ఏ నిధి నిక్షేపాల లంకె బిందెలు పాతి పెట్టాడని ఇంత పని చేశాడు?
బ్యాంకులో ఏ బ్యాలెన్సులు మూలుగుతున్నాయని ఇంతకు తెగించాడు?

రేప్పొద్దున సమాజంలో నలుగురి ముందు తల ఎత్తుకుని తిరిగేదెలా?
చాదస్తపు మొగుడు చెబితే వినడు…తిడితే ఏడుస్తాడని…ఆ భార్య మాత్రం ఎంతకని ఓర్చుకుంటుంది?

జరిగిన ఘోరానికి గుండె ముక్కలై పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

“డాబా వంటలో పొరపాటున నాలుగు టమోటాలు వేసి వండాను. తప్పే. వేయకుండా ఉండాల్సింది. అసంకల్పితంగా జరిగిపోయింది. దయచేసి నా భార్యా పిల్లలను తిరిగి ఇంటికి రమ్మనండి సార్” అని ఆ భర్త మధ్యప్రదేశ్ పోలీసు స్టేషన్ మధ్యలో కూర్చుని ఏడుస్తున్నాడు.

పోలీసులు కూడా మనుషులే కదా?
వారికి మాత్రం భార్యలుండరా?
పిన్ ఓపెన్ చేసిన బాంబుకయినా ఎదురు వెళ్ళగలరు కానీ…
తొడిమ ఒలిచిన టమోటోకు ఎదురు వెళ్లేంత ధైర్యం చేయగలరా?

నాలుగు కాలాలు పచ్చగా నిగనిగలాడుతూ మిసమిసలాడుతూ ఉండాల్సిన పచ్చని కాపురంలో ఆఫ్టరాల్ నాలుగు నిగనిగలాడే ఎర్రటి టమోటాలు ఇంత చిచ్చు పెట్టాయి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్