లాటిన్ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మధ్య అమెరికాలోని పశ్చిమ పనామాలో వలసదారులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 39 మంది దుర్మరణం చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కొలంబియా నుంచి డేరియన్ లైన్‌ను దాటి పనామాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గౌలాకా శరణార్థుల శిబిరానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఈక్వెడార్, క్యూబా దేశాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని సమాచారం.
అయితే బస్సు ఆ షెల్టర్‌ను దాటి ముందుకు వెళ్లడంతో దానిని మళ్లీ హైవేపైకి తీసుకురావడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న మరోబస్సు దానిని ఢీకొట్టింది. దీంతో అది లోయలో పడిపోయిందని పనామా అధ్యక్షుడు లారెన్షియో కార్టిజో వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 66 మంది ఉన్నారని తెలిపారు. 39 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారని, మిగిలినవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గతేడాది ఇదే మార్గం గుండా 2,48,000 వలసదారులు మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు తెలిపారు. వారిలో అత్యధికంగా వెనెజులాకు చెందినవారు ఉన్నారని తెలిపారు.
లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి ఉపాధి కోసం అమెరికా వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నిస్తుంటారు. అక్రమ మార్గాల ద్వారా వెళ్ళే వారు పనామా ద్వారా వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది.