ఎక్కడా సాయిపల్లవి జాడ లేదే! 

సాయిపల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. అంతగా ఆమె ఇక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసింది. 2005లోనే ఒక తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత గ్యాపులు తీసుకుంటూ మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమా చేసింది. ఈ సినిమాతోనే ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమానే తెలుగులో ఆమెకి ‘ఫిదా’తో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పెళ్లి పేరుతో ఉన్న ఊరునీ .. కన్నవాళ్లను వదిలేసి వెళ్లిపోవడం ఇష్టం లేని ఒక మధ్యతరగతి యువతి కథ ఇది. ఈ సినిమాతో సాయిపల్లవి అందరి మనసులను కట్టిపడేసింది.

తెరపై పద్ధతిగా కనిపించడానికి ప్రాధాన్యతనిస్తూ ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టాయి. సాయిపల్లవి సహజమైన నటన మాత్రమే కాదు, ఆమె డాన్స్ కూడా అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళ్లింది. సాయిపల్లవి సినిమా అంటే ఆ కథలో కొత్తదనం ఉంటుంది అనే ఒక నమ్మకం ప్రేక్షకులలో బలపడిపోయింది. ఆమె ఎంచుకునే కథల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతూ వచ్చారు. ఫలితంగా ఆమెకి ఒక స్టార్ హీరో స్థాయిలో క్రేజ్ వచ్చేసింది.

‘లవ్ స్టోరీ’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ఆ తరువాత ఆమె అదే జోరును కొనసాగిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ‘విరాటపర్వం’ తరువాత ఆమె మరో తెలుగు సినిమా ఒప్పుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఏ కొత్త ప్రాజెక్టులోను ఆమె పేరు వినిపించడం లేదు. సాయిపల్లవికి కథలు నచ్చకపోవడం వలన ఆమెకి ఈ గ్యాప్ వచ్చిందా? లేదంటే నటన పరంగా .. డాన్స్ పరంగా ఆమె ధాటిని తట్టుకునే విషయంలో యంగ్ హీరోలు టెన్షన్ పడుతున్నారా? అనేదే తెలియడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *