అదానీ రోడ్ లు…అంబాని స్టేషన్లు

National Monetisation Pipeline

ఎయిర్ పోర్ట్ లు ప్రైవేటుపరం అయిపోయాయి.
పోర్ట్ లు ప్రైవేటుపరం అయిపోయాయి.
రైళ్ళు ప్రైవేటుపరం అయిపోయాయి.

ఇక ఇప్పుడు రోడ్ ల వంతు.
రైల్వే స్టేషన్ ల వంతు.
టెలికాం టవర్ ల వంతు.

గ్యాస్ పైప్ లైన్ ల వంతు.
విద్యుత్ టవర్ల వంతు.
విద్యుత్ కేంద్రాల వంతు.

ప్రభుత్వ గనుల వంతు..
క్రీడా స్టేడియాల వంతు… ఒకటేల?
అన్నీ అమ్మకానికో, దీర్ఘ కాలిక లీజ్ కో సిద్ధం.

మోడీ నాయకత్వంలో నిర్మలమ్మ గారు ఆవిష్కరించిన “నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్” చిత్రమిది.

ఇక మీరు రేపు హైదరాబాద్ నుంచి ఏ విజయవాడో వెళ్తుంటే.. అక్కడ అంబాని గారిదో, ఆదానిగారిదో, లేదా మన తెలుగు వారే అయిన “జీవికే” గారిదో, “జీయంఆర్” గారిదో , “మేఘా” వారిదో “టోల్ గేటు” ప్రత్యక్షం అవ్వవచ్చు.

ఇక మీరు ప్రయాణం చేయదలుచుకొన్న రహదారి ఏ కంపనీ వారిదో చూసి, వారి వెబ్ సైట్ లో కి లాగిన్ అయ్యి, ముందే వారికి సమర్పించవలసిన “ వినియోగ చార్జీ” లను సమర్పించేసి..ఈ- పాస్ సాధించి ప్రయాణం చేయాల్సి రావొచ్చు.

ఇక ట్రైన్ లు ఎక్కాలంటే కాచిగూడనో, నాంపల్లో ఉరుక్కొంటూ వెళ్లి ఎక్కడం కష్టం కావొచ్చు.స్టేషన్ ప్రవేశానికి కూడా విఐపిదో, వివిఐపిదో, జనరల్ దో పాస్ కావాల్సి రావొచ్చు.సదరు వివిఐపి పాస్ వారిని సదరు స్టేషన్ వారే ఇంటినుంచి ఏసి కార్లలో తెచ్చి కాలు కింద పెట్టకుండా, స్టేషన్ లో కాలు కూడా కింద పెట్టనీయకుండా కార్ నుంచి ట్రైన్ కు ట్రాన్స్ఫర్ చేయవొచ్చు.

ఇక జనరల్ పాస్ వారు గంట ముందే స్టేషన్ గేటు ముందు నిలబడి.. ట్రైన్ వచ్చిన తరువాతే స్టేషన్ లోకి అనుమతింప బడవచ్చు. లేదా ఎయిర్ పోర్ట్ లో లాగా రైల్వే స్టేషన్లో కూడా ప్రతి ప్రయాణికుడు ఒక కిలో మీటర్ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా నడిచి.. ట్రైన్ ను చేరుకోవలసి రావొచ్చు.

ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న ఈ “మౌలిక సదుపాయలన్నింటిని” ప్రైవేటు కు అప్పచెప్పేసి, ఆ నిధులతో గబగబా మన మోడీగారు కొత్త “మౌలిక సదుపాయాలు” అభివృద్ధి చేసేసి.. మళ్ళీ వాటిని మన సంక్షేమం కోసం ప్రైవేటు కు అప్పచెప్పేసి.. మళ్ళీ నిధులతో మళ్ళీ…అబ్బో ఇక ఈ దేశంలో “మౌలిక సదుపాయాల”కు కొరత ఉండదేమో!

ఏమో! ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ఆస్తులన్నింటిని ప్రభుత్వం మన కోసం, మన సంక్షేమం కోసం, ప్రైవేటు కు అప్పచెప్పడమే మనకు మేలేమో!

అప్పుడెప్పుడో పోర్చుగీసు, ఫ్రాన్సు, బ్రిటీష్ కంపెనీలు భారత దేశంలో ఊళ్ళను, వ్యాపారాలను, ఓడరేవులను కొని,. క్రమంగా దేశ పరిపాలను వారి చేతుల్లోకి లాక్కున్నట్లు మళ్ళీ అదే జరగబోతోందా?

ఇక దేశీయ, విదేశీయ కంపెనీలు మళ్ళీ చిన్నగా రోడ్లు, రైళ్ళతో ప్రారంభించి ఊరూ వాడా కొనేసి మళ్ళీ మనని పరిపాలించేస్తాయా?

ఇందంతా ఈ “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం” లో జరగడానికి మన “రాజ్యాంగం” అనుమతిస్తుందా?

ఏమో! కొన్నిటికి సమాధానాలు కాలమే చెప్పాలి.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read:

ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

Also Read:

సహకారం-మమకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *