ఐపీఎల్ టోర్నీలో ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబి దుబాయ్ చేరుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వీరిద్దరూ ఆడుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. ఈ ఇద్దరు ఆటగాళ్ళు దుబాయ్ చేరుకున్న విషయాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం ధృవీకరించింది. రషీద్, నబీ లు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారని, వారు రెండో భాగం ఐపీల్ సీజన్ లో తమ సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. వీరిద్దరితో తమ బంధం కేవలం ఐపీల్ కు మాత్రమే పరిమితం కాదని, వారిని తమ కుటుంబ సభ్యుల్లాగే భావిస్తామని పేర్కొంది.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘన్న్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా కొంత మానసిక ఆవేదన, ఆందోళనకు గురైనట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ వారికి మానసికంగా భరోసా ఇచ్చింది. వీరిద్దరూ ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ టి-20 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆడనున్నారు. రెండు నెలల క్రితం టి-20 జట్టు కెప్టెన్ గా రషీద్ నియమితుడయ్యాడు. అయితే వరల్డ్ కప్ టి 20 జట్టును రెండ్రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది, జట్టు ఎంపికలో తన పాత్ర లేకుండా చేశారని, కనీస సమాచారం కూడా ఇవ్వలేదని కలత చెంది కెప్తెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. మహమ్మద్ నబీకి సారధ్య బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ సన్ రైజర్స్ జట్టులోనే ఆడుతుండడం విశేషం.