మరి కొన్ని నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అంతర్గత కలహాలతో బజారున పడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు- రాజకీయనాయకుడయిన ప్రఖ్యాత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పొత్తు కుదరక కాంగ్రెస్ అధిష్ఠానం తల పట్టుకుని కూర్చుంది. సిద్ధు ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిసిన తరువాత- ఆయన్ను పంజాబ్ పి.సి.సి అధ్యక్షుడిని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ – నవజ్యోత్ సింగ్ సిద్దు ఇద్దరు నేతలు పాటియాలా జిల్లాకు చెందిన వారు. ఒకే జిల్లా నుండి సి ఎం, పీ సి సి ప్రెసిడెంట్ ఉండడం ప్రాంతీయ సమతౌల్యం దృష్ట్యా మంచిది కాదని ముఖ్యమంత్రి వాదిస్తున్నారు. పైగా ఇద్దరు జాట్ సిక్కులే అవుతున్నామని అమరిందర్ తన అభ్యంతరాలను పార్టి ముందు పెట్టారు. అసలే పంజాబ్ లో హిందువులు నిర్లక్ష్యానికి గురైనట్లు బాధపడుతున్నారు కనుక హిందువును పీ సి సి సారథి చేయాలన్నది ఆయన వాదన. పార్టి అధిష్టానం మాత్రం సిద్ధూను పీ సి సి ప్రెసిడెంట్ ను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు వర్కింగ్ ప్రేసిడేంట్ల విషయంలో కుల సమీకరణలుపాటిస్తే సరిపోతుందన్నది అధిష్టానం అభిప్రాయం.