విశ్వ వీధిలో భారత్ కీర్తి పతాకా ఎగురవేసింది. ప్రపంచ దేశాలు నివ్వెర పోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం చేశారు. చంద్రయాన్-1 నుంచి 2 వరకు జరిగిన వైఫల్యాల్ని గుణపాఠంగా స్వీకరించి చంద్రయాన్-3 తో సత్తా చాటారు.
చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఇప్పటి వరకు ఏ దేశం దిగని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి మీసం మెలేసింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలవ్వగా 6.04 గంటలకు చందమామను చంద్రయాన్-3 ముద్దాడి అంతరిక్షంలో భారత ప్రతిష్టను చాటి చెప్పింది. ఇక నేటి నుంచి 14 రోజుల పాట జాబిల్లిపై రోవర్ పరిశోధనలు చేయనుంది.
ఇప్పటివరకు అమెరికా, సోవియెట్ రష్యా, చైనా లు మాతమే చంద్రునిపై కాలు మోపాయి. నాలుగో దేశంగా భారత్ వాటి సరసన చేరింది. అయితే జాబిల్లి దక్షిణ ద్రువంపై ఇంతవరకు ఏ దేశం విజయవంతంగా కాలు మోపలేదు. ఇటీవల యత్నించిన రష్యా కూడా విపలమైంది.
ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణ ఆఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. విదేశాల్లోని భారతీయులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.