Friday, March 6, 2026
HomeTrending Newsఏపీలో పలు జిల్లాలకు మళ్ళీ రెడ్ అలర్ట్

ఏపీలో పలు జిల్లాలకు మళ్ళీ రెడ్ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని…. ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10 కి.మీ. వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్… ఉత్తరాంధ్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని చెప్పారు. గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు.

భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయని, వాయుగుండం ప్రభావంతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్ లలో ప్రయాణించవద్దని వాహనదారులను హెచ్చరించారు. పలు ఘాట్ రోడ్ లలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి వద్ద సముద్రం వెనక్కి వెళ్ళింది. దీనికి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్ వద్ద కనిపించక పోగా, సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. తీరం ఒడ్డు వెంట సుమారు రెండు అడుగుల మేర ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. దీనితో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం తెలియరాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular