Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅగ్నిధార- అశ్రుధార

అగ్నిధార- అశ్రుధార

Agni Path Row:

“वृक्ष हों भले खड़े
हों घने, हों बड़े
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

तू न थकेगा कभी
तू न थमेगा कभी
तू न मुड़ेगा कभी
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

यह महान दृश्य है
चल रहा मनुष्य है
अश्रु-स्वेद-रक्त से
लथ-पथ! लथ-पथ! लथ-पथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!”

హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ కవిత “అగ్నిపథ్” ఇది.

“నీచుట్టూ చెట్టంత నీడనిచ్చే చెట్టు…
ఏ ఒక్క ఆకును తన నీడ ఏదని అడగకు…అడగకు…అడగకు…
(నడువు…ఇదొక)
అగ్నిపథం…అగ్నిపథం…అగ్నిపథం…

ఆగదు నీ పయనం
ఆగదు నీ నడక
వెనుతిరగవు నువ్వు
(ఆగదని)
ప్రమాణం చెయ్యి…ప్రమాణం చెయ్యి…ప్రమాణం చెయ్యి…
(నడువు…ఇదొక)
అగ్నిపథం…అగ్నిపథం…అగ్నిపథం…

ఇదొక అలౌకిక అనుభూతి
చెమట చుక్కల్లో, కన్నీటి సుడుల్లో, రక్తాశ్రువుల్లో మునిగినా…
తెగిపడ్డ అవయవాలను కుట్టుకుని,
గాయాలకు కట్లు కట్టుకుని
మనిషి నడుస్తూనే ఉన్నాడు…
(నడువు…ఇదొక)
అగ్నిపథం…అగ్నిపథం…అగ్నిపథం…”

నాకు తెలిసిన కొద్దిపాటి హిందీ పరిజ్ఞానంతో ఈ కవితకు అర్థం ఇదయి ఉంటుందని గురికి బెత్తెడు దూరంగా అనుకుంటున్నాను. కాకపోతే చెప్పండి…సవరించుకుంటాను.

విశ్వ విఖ్యాత నటుడు అమితాబచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్. హిందీ, అవధి భాషల్లో గొప్ప పండితుడు. ఆధునిక హిందీ కవితా ప్రక్రియలో వీర విహారం చేసినవాడు. కేంబ్రిడ్జ్ లో పి హెచ్ డి చేసినవాడు. మన తెలుగులో శ్రీ శ్రీ “నేను సైతం ప్రపంచాగ్నికి” ని కోట్ చేసినట్లుగా హిందీలో ఈ “అగ్నిపథ్” కవితా పంక్తులను కోట్ చేస్తూ ఉంటారు. 1970 ప్రాంతాల్లో అచ్చయిన కవిత ఇది. అంతకు పూర్వమే ఎప్పుడో రాసినది అయి ఉంటుంది. అగ్నిపథ్ పేరుతోనే అమితాబ్ హీరోగా 1990 ప్రాంతాల్లో సినిమా కూడా వచ్చినట్లుంది.

విడి విడిగా హరివంశ్ రాయ్ అనేక అంశాల మీద ఎప్పుడెప్పుడో రాసి పెట్టుకున్న కవితలను “అగ్నిపథ్” పేరుతోనే సంకలనంగా ముద్రించారు. అప్పటినుండి “అగ్నిపథ్” ఉత్తరభారతంలో ఒక వాడుక మాట అయిపోయింది.

ఇప్పుడు అసలు విషయాలోకి వద్దాం. భారత సైన్యంలో నాలుగేళ్ల పరిమిత కాల ఉద్యోగాల నియామకాల విధానానికి “అగ్నిపథ్” పేరు పెట్టడానికి హరివంశ్ రాయ్ కవితే కారణమయి ఉండాలి.

నిజమే-
ఇదొక అగ్ని పథం.
ఏ ఒక్క ఉద్యోగాన్ని విడిగా ఏమిటిలా? అని అడగకుండా నడవాల్సిన అగ్నిపథం.

నిజమే-
నిరుద్యోగ పయనం ఆగకుండా;
వెనుతిరగకుండా;
నడక ఆపకుండా వెళ్లాల్సిన అగ్నిపథం.

నిజమే-
చదువుల పట్టాలు
బతుకు పట్టాల మీద ఛిద్రమవుతున్నా…
తుపాకి గుళ్లు వర్షిస్తున్నా…
చెమట చుక్కల్లో, కన్నీటి సుడుల్లో, రక్తాశ్రువుల్లో అవయవాలు తెగిపడుతున్నా…

Agni Path Scheme
కుట్టుకుని…
కట్టుకుని…
ప్రాణాలను ఉగ్గబట్టుకుని…
ప్రమాణం చేస్తూ నడవాల్సిన ప్రయాణం-
అగ్నిపథం…అగ్నిపథం…అగ్నిపథం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అత్త మీద కోపం దుత్త మీద

RELATED ARTICLES

Most Popular

న్యూస్