Friday, March 29, 2024
HomeTrending Newsఅస్సాం మేఘాలయాల్లో కుండపోత వానలు

అస్సాం మేఘాలయాల్లో కుండపోత వానలు

అసోం,  మేఘాలయ రాష్ట్రల్లో  వరద పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రధాన నదులలో నీటి మట్టాలు పెరిగాయి. కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మేఘాలయ లో సుమారు 19 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య రెండు రాష్ట్రాలలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర, గౌరంగ నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. వరుసగా మూడో రోజు కూడా నీటి  కారణంగా రాజధాని గౌహతిలోని చాలా ప్రాంతాలు స్తంభించాయి. గౌహతి నగరంలో నూన్‌మతి ప్రాంతంలోని అజంతానగర్‌లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు,  కొండచరియలు కూడా విరిగిపడ్డాయి.

వరద ప్రభావిత జిల్లాల్లోని 19782.80 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 72 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,510 గ్రామాలు ప్రస్తుతం నీటిలో మునిగి ఉన్నాయి. మేఘాలయ, అస్సాంలలో వరదలకు 28 జిల్లాలలోని దాదాపు 11 లక్షల మంది ప్రభావితం అయ్యారు.

అస్సాం వరదల నేపథ్యంలో ఆరు రైళ్లు రద్దు అయ్యాయి. నల్బరి, ఘోగ్రాపర్​తో పాటు ఇతర ప్రాంతాల్లో వరద నీరు రైల్వే ట్రాక్​లపైకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్​లు కూడా కనిపించడం లేదు. మేఘాలయలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఫలితంగా రాష్ట్రానికి ప్రాణాధారమైన 6వ జాతీయ రహదారిని పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని రెండు రాష్ట్రాలకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది భారత వాతావరణశాఖ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్