Thursday, April 18, 2024
HomeTrending Newsకేంద్ర వ్యవసాయ విధానం అస్తవ్యస్తం - మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్ర వ్యవసాయ విధానం అస్తవ్యస్తం – మంత్రి నిరంజన్ రెడ్డి

విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుండని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో ఈ రోజు జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయం వృత్తి కాదు జీవితం,ఇది సంస్కృతిని నేర్పే ఆయుధమన్నారు. భూమికి, మట్టికి దూరం కావడం అంటే తల్లిదండ్రులకు దూరం అయినట్లే. రాబోయే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం నిలుస్తుందన్నారు. యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే దేశ భవిష్యత్ కు మేలు అని, యువత ఈ రంగం వైపు ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.  ప్రపంచ విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలని, నాణ్యమైన విత్తనం రైతుకు అందాలన్నారు. నిరంతర పరిశోధనలతోనే ప్రగతి సాధ్యమని, పరిశోధనల మూలంగానే చిన్న దేశమైనా ఇజ్రాయిల్ ప్రపంచదేశాలు తనను అనుసరించేలా చేస్తున్నదన్నారు.

కాలక్రమంలో పంటల సాగు విధానం మారిందని ఒకప్పుడు వానాకాలం పండించే వేరుశెనగ ఇప్పుడు యాసంగిలో పండిస్తున్నారని మంత్రి తెలిపారు. తాజాగా పత్తి సాగు యాసంగిలో వేస్తున్నారని, ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు అనే రైతు యాసంగిలో పత్తి సాగు చేసి 18 క్వింటాళ్లు సాధించారని వెల్లడించారు. రైతును మించిన శాస్త్రవేత్తలు లేరు అనడానికి ఇది నిదర్శనమన్నారు. శాస్త్రవేత్తలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి. రాబోయే యాసంగిలో పెద్ద ఎత్తున పత్తి సాగుకు రైతులు సిద్దమవుతున్నారు. మార్చి నెలకు ముందే యాసంగి వరి పంటలు కోతకు వచ్చేలా రైతులు చూసుకోవాలి .. మార్చి నెల దాటితే వడగళ్ల వానలు వస్తాయి.దాదాపు 20 దేశాలకు విత్తనాలను తెలంగాణ నుండి ఎగుమతి చేస్తున్నామని.. ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

తెలంగాణ, ఆంధ్రలో దాదాపు ఏడు లక్షల మంది విత్తన రైతులు ఉన్నారని మంత్రి వెల్లడించారు. విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కేంద్రం దృష్టి సారించడం లేదన్నారు. దేశం నుండి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారని, ఇతర దేశాల నుండి అనేక ఉత్పత్తులు అడ్డగోలుగా దిగుమతి అవుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదని విమర్శించారు. కేంద్రమంత్రికి మన్ను తెల్వదు, మట్టి తెల్వదు, విత్తనం తెల్వదు, పంట తెల్వదు .. కనీసం అధికారుల సలహాలు తీసుకోరన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయి అన్నారు .. ఆరు నెలలు తిరగక ముందే ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టారని గుర్తు చేశారు. నాలుగేళ్లు కాదు ఎనిమిదేళ్లు కరవొచ్చినా పంటలు పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ నిలిపారన్నారు.

ఈ సమావేశానికి సీడ్స్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఏఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి రవికుమార్, కోశాధికారి చేరాలు , ఈడీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్ మెన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ యోగేశ్వరరావుకు విత్తనరంగ పితామహుడు బిరుదునిస్తూ జీవిత సాఫల్య పురస్కారం మంత్రి అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్