Ahmedabad Bomb Blast Case :
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు శిక్ష ఖరారైంది. 2008లో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి 49మంది నిందితుల్లో 38మందికి మరణశిక్ష, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 77మంది నిందితులపై విచారణ జరిపింది. 2008 జులై 26న అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో వరుసగా 21 చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో కనీసం 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), హర్ఖత్ ఉల్ జిహాదీ ఆల్ ఇస్లామీ తీవ్రవాద సంస్థలే ఈ పేలుళ్లకు కారణమని తేల్చారు.
13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ..
కాగా ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు మొత్తం 85 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో 78 మందిపై విచారణ కొనసాగించారు. ఆపై నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77కి తగ్గింది. నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఇక డిసెంబర్ 2009లో ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. గుజరాత్ స్పెషల్ కోర్ట్1,100 మందికి పైగా సాక్షులను విచారించింది. అయితే 2016లో కొంతమంది నిందితులు జైలులో 213 అడుగుల పొడవైన సొరంగం తవ్వి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది.