కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. ఈ మేరకు గతకొద్దిరోజులుగా నెలకొన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. ఫలితం ఏదైనా.. పార్టీని ఏకం చేసేందుకు తాను కృషి చేస్తానని గహ్లోత్ వివరించారు. కాంగ్రెస్‌ను బలమైన విపక్షంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్థాన్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన కొచ్చిలో విలేకరులతో మాట్లాడారు.
నామపత్రాలు ఎప్పుడు దాఖలు చేయాలో రాజస్థాన్ వెళ్లాక నిర్ణయిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. ఇతర కాంగ్రెస్ మిత్రులు సైతం బరిలో దిగవచ్చు. కానీ, పార్టీని అన్ని స్థాయులలో బలోపేతం చేసి ఐకమత్యం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి బలమైన విపక్షం అవసరం. ఫలితాలు వచ్చాక అందరం కలిసే పనిచేసుకుంటామని అశోక్ గహ్లోత్ వెల్లడించారు. సచిన్ పైలట్‌కు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించడం కోసమే వ్యూహాత్మకంగా గెహ్లట్‌కు ఏఐసీసీ పగ్గాలు అప్పగించాలని సోనియా, రాహుల్ నిర్ణయించారనే భావన సైతం వ్యక్తమవుతోంది. అయితే రాజస్థాన్ కేంద్ర బిందువుగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రాజకీయాలు సాగటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై తన వైఖరి ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా రాహుల్ గాంధీ తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో భారత్ జోడో యాత్ర విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా యాత్రలో పాల్గొంటున్నారన్నారు.యూపీలో ఏం చేయాలనే దానిపై తమకు స్పష్టత ఉందన్నారు. దేశంలో వినాశకరమైన విధానాలతో నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో తమ యాత్రలో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని ఆయన చెప్పారు. దేశ ప్రజలు బాధలో ఉన్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు యాత్రలో పాల్గొంటున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఎంపీ శశిథరూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించిన రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read : గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి జంప్