రష్యాలోని మగదాన్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. గురువారం ఉదయం 10.27 గంటలకు (రష్యా కాలమాన ప్రకారం) మగదాన్ నుంచి ఎయిర్ ఇండియా ఏఐ173డీ విమానం ప్రయాణికులు, సిబ్బందితో గమ్యస్థానానికి బయలుదేరిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఫ్లైట్‌లోని ప్రయాణికులకు మరోసారి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రిసీవ్ చేసుకునేందుకు శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో సహాయక సిబ్బంది సంఖ్యను పెంచి, వారిని అప్రమత్తం చేసినట్లు తెలిపింది.
ఈ నెల 6న ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు ఎయిర్ ఇండియాకు చెందిన AI173 విమానం బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ మాస్కో సమీపంలోని మగదాన్ విమానాశ్రయాన్ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఇందుకు అనుమతి ఇవ్వడంతో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి 232 మంది వరకు ఉన్నారు. అయితే ప్రయాణికులను శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబై నుంచి ఆ విమానం రష్యాకు బయలుదేరింది.