Sunday, February 23, 2025
HomeTrending Newsఅల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి హతం

అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో అల్​ఖైదా అధినేత అయ్ మాన్ అల్ జవహరి హతమయ్యాడు. జవహరీని హతమార్చే వ్యూహాన్ని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని ఐదుగురు కీలక వ్యక్తులు అమలు చేశారని సమాచారం. జవహరీ హత్యకు పథకాన్ని యూఎస్ అత్యంత రహస్యంగా చేసింది. సీనియర్ తాలిబన్ నేత సిరాజుద్దీన్ హక్కానీకి చెందిన సన్నిహిత సహచరుడి ఇంట్లో అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ఉండగా యూఎస్ డ్రోన్ దాడితో హతమార్చామని యూఎస్ అధికారులు వెల్లడించారు. అమెరికా ప్రజలకు హాని కలిగించిన వారు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు.

కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్​ లాడెన్​కు అత్యంత సన్నిహితుడు అల్ జవహరి. అంతే కాదు.. అతనొక సర్జన్​ కూడా.. అయ్​మన్​ అల్​ జవహరి.. ఈజిప్ట్​ దేశస్థుడు. 1951 జూన్​ 19న గిజాలో జన్మించాడు. 2011లో ఒసామా బిన్​ లాడెన్​ను ప్రత్యేక ఆపరేషన్​లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. ఆ తర్వాత.. అతని స్థానాన్ని అల్​ జవహరి భర్తీ చేశాడు. బిన్​ లాడెన్ ​లాగే.. 71ఏళ్ల అల్​ జవహరి కూడా విద్యావేత్త. బిన్​ లాడెన్​కు బిజినెస్​- ఎకనామిక్స్​ అడ్మినిస్ట్రేషన్​లో డిగ్రీ ఉంది. అతను ఒక సివిల్​ ఇంజినీర్​ కూడా. ఇక అల్​ జవహరి సైతం ఈజిప్ట్​లో సర్జన్​గా పనిచేశాడు. మూడేళ్ల పాటు ఈజిప్టు సైన్యానికి సేవలందించాడు.

1981లో ఈజిప్ట్​ అధ్యక్షుడు అన్వర్​ సాదత్​ హత్య జరిగింది. ఈ ఘటనలో 100మందికిపైగా ప్రజలను అరెస్ట్​ చేశారు. వారిలో అల్​ జవహరి ఒకడు. అప్పుడు అతడి వయస్సు 30ఏళ్లు. ఆ సమయంలో అతడిని పోలీసులు జైలులో చిత్రహింసలకు గురిచేసినట్టు సమాచారం. ఈఐజే(ఈజిప్టియన్​ ఇస్లామిక్​ జిహాద్​) సంస్థను స్థాపించిన అల్​ జవహరి.. 1998లో దానిని అల్​ఖైదాలో కలిపేశాడు. అతను బిన్​ లాడెన్​కు రైట్​ హ్యాండ్​..  బిన్​ లాడెన్​ ఉగ్ర కార్యకలాపాల్లో అల్​ జవహరి చురుకుగా పనిచేశాడు. అమెరికాపై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. 9/11 దాడులను విజయవంతం చేసేందుకు.. బిన్​ లాడెన్​కు అండగా తన వంతు కృషి చేశాడు. అల్​ జవహరి తలపై 25మిలియన్​ డాలర్ల రివార్డును ప్రకటించింది అమెరికా. 9/11 దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక అల్​ జవహరి మరణాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ధ్రువీకరించారు. “అమెరికా సైన్యం.. శనివారం కాబుల్​లో వైమానిక దాడి జరిపింది. ఈ ఘటనలో అల్​ జవహరి హతమయ్యాడు. ఎంత కాలం గడిచిపోయినా, ఎవరు ఎక్కడ దాగి ఉన్నా.. ప్రజలకు మీరు ముప్పు అని తెలిస్తే.. మిమ్మల్ని అమెరికా వేటాడి చంపేస్తుంది. న్యాయం జరిగింది. బిన్​ లాడెన్​కు జవహరి అత్యంత సన్నిహుతుడు. 9/11 దాడుల్లో బిన్​ లాడెన్​కు జవహరి డిప్యూటీగా పనిచేశాడు. 9/11 దాడులకు ప్రణాళికలు రచించడంలో అతనిది కీలక పాత్ర. ఏడాది క్రితం.. అఫ్గానిస్థాన్​లో అమెరికా సైన్యం కార్యకలాపాలను ముగించాలని నేను నిర్ణయించాను. 20ఏళ్ల తర్వాత అక్కడ మన సైన్యం అవసరం లేదనిపించింది. కానీ అమెరికా ప్రయోజనాల కోసం.. అఫ్గాన్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రజలకు మాట ఇచ్చాను. అల్​ఖైదా అధినేత విషయంలో ఇప్పుడదే చేశాను” అని మీడియాకు జో బైడెన్​ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్