పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ నేడు పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆయన్ను తనకు ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రేపటి నుంచే అయన కొత్త బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ బాధ్యతలు అయన చూస్తారని వెల్లడించారు.
యాస్ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షకు చీఫ్ సెక్రటరీ హోదాలో నిర్వహించాల్సిన అలాపన్ మొక్కుబడిగా సమావేశంలో పాల్గొన్నారు. మమతా బెనర్జీతో కలిసి సమావేశ మందిరంలోకి వచ్చి ఆమెతోనే తిరిగి వెళ్ళిపోయారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన్ను కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్ర పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్న అలాపన్ ను కేంద్ర సర్వీసులకు పంపే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ కేంద్రానికి జవాబిచ్చారు. అయితే ఈరోజు హఠాత్తుగా జరిగిన పరిణామాల్లో అయన తన పదవినుంచి రిటైర్ కావడం, వెంటనే ముఖ్య సలహాదారుగా నియామకం క్షణాల్లో జరిగిపోయాయి.
కేంద్ర అధికారులను ప్రధాని మోడీ కూలీలుగా చూస్తున్నారని మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్రంలో చాలామంది బెంగాల్ కేడర్ అధికారులు ఉన్నారని, కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా వారిని తాను వెనక్కి పిలవొచ్చా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న అలాపన్ పదవీ కాలం వాస్తవానికి నేటితోనే ముగియాల్సి ఉంది, అయితే కోవిడ్ సమయంలో అయన సేవలు అవసరమని, అయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పెంచాలని గతంలో మమత చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది, అయితే మోడీ సమీక్షా సమావేశం తదనంతర పరిణామాల్లో నేడు రిటైర్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత ప్రభుత్వ ఆదేశాలను పాటించని కారణంగా అలాపన్ తప్పనిసరిగా క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.