దూకుడు ముందు అనుభవం ఓటమి పాలైంది. సెర్బియా సూపర్ స్టార్ నోవాక్ జకోవిచ్ జైత్రయాత్రకు స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్ అడ్డుకట్ట వేసి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. నేడు దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్ లో 1-6; 7-6; 6-1; 3-6; 6-4 తో అల్కరాజ్ విజయం సాధించాడు.
ఇప్పటికే 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెల్చుకొని తన పేరిట చరిత్ర సృష్టించుకున్న జకోవిచ్ 24వ టైటిల్ కూడా సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరినా ఆ ఆశ నెరవేరలేదు.
వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్న అల్కరాజ్ నంబర్ 2 గా ఉన్న జకోవిచ్ పై తొలి సెల్ కోల్పోయినా రెండో సెట్ ను టైబ్రేకర్ తో కైవసం చేసుకుని, మూడో సెట్ ను అలవోకగా నెగ్గాడు. కానీ నాలుగో సెట్ లో జకోవిచ్ సత్తా చాటి చేజిక్కించుకున్నాడు. నిర్ణాయక చివరి సెట్ లో జకోవిచ్ పై ఆధిక్యం సంపాదించిటైటిల్ సొంతం చేసుకున్నాడు.
అల్కరాజ్ కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్ టైటిల్ ను సాధించాడు.